మయూరి సుధ

>> ఆదివారం 22 నవంబర్ 2009


చంద్రబింబం లాంటి మోము ఆమెది... సుధారసాన్ని కురిపించే మాటలు ఆమెవి... కాలికి గజ్జ కట్టి ఆమె శాస్త్రీయ నృత్యం చేయటం మొదలుపెడితే మయూరాన్ని తలపించి ,ఆపై మరిపించగల నాట్య విన్యాసం ఆమెది. ఆమె కెంపులు, అరవంకలు- వడ్డాణపు నడుమొంపులు మనలను ముగ్ధులను చేస్తాయి.. కాటుక కన్నులు, పూలజడల అరమరికతలు మనసును పరవశింపజేసి నాట్యం చేయిస్తాయి... ఆమె నడకలో వయ్యారాలు, చూపుల్లో సితారలు చిలిపిగా పలకరిస్తాయి... కుడి ఎడమల క్రీగంటి చూపులు, జతులు, గతులు, ముద్రలు ముగ్ధమనోహరంగా పలకరిస్తాయి... జీవితంలో ఎదుర్కొన్న ఓ ప్రమాదం తనను మానసికంగా కృంగదీసి ప్రాణసమానమైన నాట్యానికి దూరం చేసినా మొక్కవోని పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో విజయం సాధించిన ఓ అసాధారణ మహిళ "సుధా చంద్రన్".

మొన్న శనివారం ఆ వారాంతం ఎలా గడుపుదామా అని ఆలోచిస్తున్న సమయంలో సోదరుడు శ్రీనివాస్ కుమార్ ఫోన్ చేసి ’మయూరి సుధ’ గారి నాట్య ప్రదర్శన రవీంద్ర భారతిలో ఉంది- వస్తావా? అని అడిగారు-ఎప్పుడో 10వ తరగతిలో ఆమె గురించి పాఠంగా చదువుకున్న నాకు ఆమె ప్రదర్శనను తిలకించే అదృష్టం, నాకు పునర్జన్మను ప్రసాదించిన ఆమెను కళ్ళారా చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి "సరే" అని చెప్పా... కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి శ్రీనివాస్ కుమార్ గారి కుటుంబం, అశ్విన్ బూదరాజు, నేను రవీద్ర భారతికి చేరుకున్నాం.

సుమారు పాతిక సంవత్సరాల తర్వాత హైదరాబాదులో ఆమె నాట్య ప్రదర్శన. నటరాజ స్వామికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోయారు.

మొదటి అంకం- ’సీతా స్వయంవరం- సీతగా సిగ్గును కురిపించింది.. రావణునిగా దర్పాన్ని ప్రదర్శించింది.. రామచంద్రుని సౌకుమార్యాన్ని, వినయాన్ని అభినయించింది... శివధనుర్భంగం నుండీ రావణ సంహారం దాకా అంతా తానే... ప్రేక్షకుల హర్షధ్వానాలు.....

రెండో అంకం- ’ ఆది శంకర విరచిత భజగోవిందం- భజగోవిందం నృత్యరూపకంగా చూడటం నాకు ఇదే ప్రధమం. ఆ శ్లోకాలలోని పరమార్ధాన్ని ఆమె ప్రదర్శించిన తీరు వర్ణనాతీతం... సంస్కృత భాష తెలియని వారికి కూడా ఆమె హావభావాలతో భజగోవింద శ్లోకాల అంతరార్ధం అవగతమైందంటే అతిశయం కాదేమో!!!

మూడో అంకం- "దశావతారాలు"- 'మత్స్య,కూర్మ, వరాహశ్చ, నారశింహశ్చ, వామనః- రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కి రేవచః' అని చిన్నప్పుడు చదివిన శ్లోకం, ఆ అవతారాలు కళ్ళముందు మెదిలాయ్. ఒక్కొక్క అవతారం నుండీ మరో అవతారానికి గల పరిణామక్రమాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన తీరు అనిర్వచనీయం. ముఖ్యంగా వామనావతారం, నృశింహావతారం, రామావతారం,కృష్ణావతారం(కురుక్షేత్ర ఘట్టం).. అంకం పరిసమాప్తమయ్యేసరికి ఆనందంతో చెమరిన కళ్ళు, మ్రోగిన చప్పట్లు అనేకం.

కూచిపూడి నృత్యం ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ శోభానాయుడు గారి చేతుల మీదుగా "నాట్య కళా నిధి" పురస్కారాన్ని సుధా చంద్రన్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న మరో విశేషం పుంభావ సరస్వతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి గారిని మేము కలవగలగటం. అక్కినేని మొదలు నావరకు ఎందరో ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు కృత్రిమ కాలిని చూడటానికి ప్రయత్నించి విఫలులమయ్యాం... కారణం సమ్మోహనం.

కార్యక్రమానంతరం మయూరి సుధ గారిని కలిసి ఓ నాలుగు నిమిషాలు మాట్లాడగలిగే అవకాశం కలిగింది. ఆమె కాళ్ళకు నమస్కరించి క్లుప్తంగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. "మూడున్నర నెలల క్రితం ఓ ప్రమాదంలో నా కాలు విరిగింది... దాదాపు రెండు నెలల పాటు నేను మంచంపైనే విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి... అప్పుడే మొదలుపెట్టిన వ్యాపారం నేను లేని కారణంగా అనేక సమస్యలను సృష్టించటం, మనసు ఆందోళన చెందటం వల్ల నిస్పృహ నన్ను ఆవహించింది. ఆ సమయంలో ఓ రోజు టీవీలో మీ ’మయూరి’ సినిమా చూశాను. అది నాలో ఉత్తేజాన్ని నింపి స్థైర్యాన్ని పెంచింది. ఇప్పుడు నేను అన్ని అవరోధాలనూ అధిగమించాను- అందుకు పరోక్షంగా మీరు కారణం.. మీకు నా కృతజ్ఞతలు"--- దానికి ఆవిడ ఇచ్చిన సమాధానం " పరిస్థితులకు తలవంచితే మనం ఓడిపోయినట్టే- గెలుపు ఇచ్చే ఆనందం కోసం అప్పట్లో నేను నొప్పిని భరించి సాధన చేశాను. పట్టుదలతో కృషి చేసేవారికి విజయం తధ్యం. ఇన్ని వందల మంది మీరు నాట్యం బాగా చేస్తారు అని చెప్పే మాటలకన్నా మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. విజయోస్తు"...

ఆమెకు వీడ్కోలు చెప్పి మధురానుభూతులను వెంటతెచ్చుకున్నాను- రేపటికి నా అనుభూతి జ్ఞాపకంగా మారినా పరిమళాలను వెదజల్లుతూ మనసులో సజీవంగా మిగిలిపోతుంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే ఈ అసాధారణ నాట్య మయూరి మరెందరో జీవితాలను ప్రభావితం చేయాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ...



ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు...

Read more...

సాక్షి

>> శుక్రవారం 11 సెప్టెంబర్ 2009

మత్తెక్కించే మల్లెల సాక్షి...

గుసగుసలెన్నో చెప్పే గులాబీల సాక్షి...

సన్నని తన నడుములాంటి సన్నజాజి పూల సాక్షి...

ముద్దుగుమ్మకి ఇష్టమైన ముద్దమందారం సాక్షి...

కవిత్వాన్ని పలికించే కనకాంబరాల సాక్షి...

భావుకతను పెంచేటి బంతిపూల సాక్షి...

చెలియ చిలిపి చూపులాంటి చామంతుల సాక్షి...

ప్రతిపువ్వును తలపించే తన చిరునవ్వుల సాక్షి...


---- నేను తనను ప్రేమిస్తున్నాను......


కలువలాగ విచ్చుకునే కాంత కళ్ళ సాక్షి...

వజ్రంతో పొదగబడిన వగలాడి ముక్కుపుడక సాక్షి...

అమౄతాన్ని చిలికించే అతివ అధరాల సాక్షి...

ఊసులకే సాక్ష్యమైన ఊగే లోలకుల సాక్షి...

నా గుండెలో సవ్వడి చేసే తన కాలి మువ్వల సాక్షి...

మందాకినిని మరిపించే ఆమె హొయల నడక సాక్షి...

తెలుగుదనం ఉట్టిపడే నా చెలి చీరకట్టు సాక్షి...


---- నేను తనను ప్రేమిస్తున్నాను......


ప్రపంచాన్ని మరిపించిన మా పరిచయ క్షణాల సాక్షి...

ఆమె మొదటి స్పర్శలోని పులకరింత సాక్షి,

తొలి ముద్దులోని తెలియని తుంటరితనం సాక్షి...

మా ఏడడుగులనూ దోచుకెళ్ళిన సముద్రపు అలల సాక్షి...

ఆమె కోసం నిరీక్షించిన యుగాల సాక్షి...

తన సమక్షంలో నేననుభవించిన ప్రతి నిమిషం సాక్షి...

చెలి వదిలిన ఒంటరితనపు పరివేదన సాక్షి...


నాదైన తన సాక్షి...

తనవాడనైన నా సాక్షి...

ఒక్కటైన మా మనసుల సాక్షి...


నేను తనను ప్రేమిస్తున్నాను... ఆమె కోసమే జీవిస్తున్నాను...

Read more...

స్నేహ సమ్మేళనం

>> సోమవారం 20 ఏప్రిల్ 2009


స్నేహ సమ్మేళనం- ఈ టైటిల్ తో ఒక ఆహ్వాన పత్రిక నేను చదువుకున్న బడి నుండి వచ్చింది. ఒక్క సారి గతంలోకి వెళ్ళిపోయాను. 

సరస్వతీ విద్యా మందిర్- నాకు విద్య నేర్పిన బడి, విలువల గుడి. 1972లో స్థాపించబడి కొన్ని వేల మంది విద్యార్ధులకు ఉత్తమ సంస్కారాలతో కూడిన విద్యను బోధిస్తూ వారి ప్రగతికి కృషి చేస్తున్న సంస్థ. సంస్కారం, నైతిక విలువలు, గుణవికాసములతో కూడిన విద్యను శిశు ప్రాయం నుండి అందించడంతో మా పాఠశాల విద్యార్ధులు నేడు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, న్యాయవాదులుగా, వ్యాపారస్తులుగా, సాంకేతిక నిపుణులుగా మరియు అనేక రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్నారు.

మేము చదువుకున్న రోజుల్లో సందడి వేరుగా వుండేది. ఉదయం ప్రార్ధన సమయానికి పిల్లలందరం కలిసి సరస్వతీ దేవి పటానికి ఇళ్ళనుండీ తీసుకెళ్ళిన పువ్వులతో అలంకరించేవాళ్ళం. "హే హంసవాహినీ.. జ్ఞానదాయినీ... " అంటూ ప్రార్ధన చేసి తరగతులకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం అన్నపూర్ణాష్టకం చదివి భోజనాలు చేసేవాళ్ళం. శారీరక, ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని మాకు సంపూర్ణంగా  కలిగించారు. 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందన్న పెద్దల మాటకి మా సరస్వతీ విద్యామందిరమే ఆధారమని నా అభిప్రాయం. సదాచారం అని ఓ సబ్జెక్ట్ వుండేది- నైతిక విలువలు, దేశభక్తి, దైవభక్తిని పాఠ్యాంశాలుగా ప్రత్యేకించి బోధించిన విధానం మరువలేనిది. మా ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర కృషి, మాపై చూపిన ప్రేమ, ఆప్యాయత ఎంత చెప్పినా తక్కువే. గురు పౌర్ణమి, రక్షాబంధన్ వచ్చాయంటే మా ఆనందానికి అవధులు వుండేవి కావు- స్నేహితులమంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించేవాళ్ళం. చిననాటి స్నేహితులు, కల్మషంలేని స్నేహం, మేం చేసిన అల్లరి గుర్తుకుతెచ్చుకుంటే మనసు ఆనందంతో వయసును మరిచిపోయింది. ఆలోచనల దొంతరలలో నుండీ బయటకి వచ్చి ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూశాను.

ఆదివారం ఉదయం గిడసబారిన పెద్దరికాన్ని బయటే వదిలేసి ఆ దేవాలయంలో అడుగుపెట్టాను. 15 ఏళ్ళలో నా జీవితంలో ఎన్నో మారాయి కానీ మా బడి మారలేదు- కానీ కాస్త కళ తగ్గింది. ప్రస్తుత విద్యార్ధులు మా బడిని చాలా అందంగా  ముస్తాబు చేశారు. అక్కడ పండగ వాతావరణం కనిపించింది. ఓ పక్క స్వాగత తోరణాలు, మరో పక్క పందిరి, ఇంకో పక్క వేదికపై అందంగా అలంకరించిన సరస్వతీ దేవి. అక్కడే సంవత్సరాల వారిగా మా గ్రూప్ ఫోటోలు. నన్ను నేను పోల్చుకోడానికి కాస్త సమయం పట్టింది.

ఇంతలో వెనకాతల నుండి ఎక్కడో పరిచయం వున్న గొంతు- తిరిగి చూస్తే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ జగన్మోహన్ గారు. నమస్కరించి పరిచయం చేసుకుంటే గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. లంగా ఓణీల్లో చూసిన మా రెండు జళ్ళ సీతలు చీరల్లోకి మారి వారి చిన్నారులతో కలిసి వచ్చారు. గర్భవతి అయినా ఈ కార్యక్రమం కోసం బెంగుళూరు నుండి వచ్చిన నా స్నేహితురాలు శ్రీమతి తులసిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఎన్నో ఏళ్ళ తరువాత కలిసినా అదే చనువు- కొన్ని మారకపోతేనే అందంగా వుంటాయేమో!  ఎవరెవరు ఏం చదువుకున్నామో, ప్రస్తుతం ఏం చేస్తున్నామో కబుర్లు చెప్పుకున్నాం. మేం చదువుకున్న తరగతి గదుల్లో మేం కూర్చున్న బల్లలని తాకినప్పుడు మనసు ఏదో తెలియని అనుభూతికి లోనైంది- బహుశా అందరి పరిస్థితీ అదేనేమో!

ప్రార్ధనా గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలుగు భాషలో విద్యా బోధన ఆవశ్యకత, పాఠశాల నూతన భవన నిర్మాణం, ఆధునీకరణ ప్రధానాంశాలుగా పెద్దల ఉపన్యాసాలు సాగాయి. ఆశ్చర్యం కలిగించేలా పూర్వ విద్యార్ధులు పెద్ద మొత్తంలో  విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అప్పుడే అనిపించింది- సహృదయం స్పందిస్తే సత్కార్యం సాధ్యమని. కార్యక్రమం సాగుతుండగా విచ్చేసిన మా సైన్స్ టీచర్ శ్రీమతి ఎస్.పార్వతి గారిని చూసిన మా ఆనందానికి అవధులు లేవు. అదే అప్యాయత, అదే హుందాతనం. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించారు. భోజనాల సమయంలో కూడా విద్యార్ధులందరినీ  తిన్నారో లేదో కనుక్కుంటుంటే అమ్మతనం కనిపించింది- అవును మేము ఆవిడ పిల్లలమేగా!

ఎవరివంతు సహాయం వారు చేస్తామని మాట ఇచ్చి, చిరునామాలు తీసుకుని తిరిగి వస్తుంటే నా హృదయం మధురానుభూతులతో నిండింది. కార్యక్రమానికి రాలేకపోయిన మా తెలుగు టీచర్ శ్రీమతి సాయిజ లక్ష్మి గారి ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేశా. అదే గొంతు. పేరు చెప్పగానే గుర్తు పట్టేశారు- ఆవిడని చూడాలన్న కోరికతో వెంటనే బయలుదేరి వారి ఇంటికి వెళ్ళాను. మనిషిలో మార్పే లేదు- అదే గాంభీర్యం- అంత ఎనర్జీ ఆవిడకే సొంతం. ఆ గొంతు వింటే ఒకప్పుడు కాస్త భయపడ్డవాడిని- ఇవ్వాళ ఆవిడతో మాట్లాడుతుంటే ఎదో ఆనందం. మళ్ళీ పాతరోజులు గుర్తుచేసుకున్నాం. నాకు భాషా సంస్కారాన్ని నేర్పిన నా గురువు ఆవిడ. నా మీద ఆవిడ ప్రభావం చాలా వుంది. సనాతన భారతి బ్లాగ్ ని చూపిస్తే చాలా సంతోషించారు(తప్పులు కనపడితే బెత్తం ఎత్తుతారేమో అన్న భయం మాత్రం నాలో వుంది). కాళ్లకి నమస్కారం చేస్తే ఆవిడ మనఃస్పూర్తిగా ఆశీర్వదించారు- ఆ ఆశీర్బలం పుణ్యమేనేమో ఈ స్థాయికి చేరుకోగలిగాం. 


 నా నేటి జీవితానికి బంగరుబాట వేయటంతో పాటు సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మానవత్వం, సభ్యత, సంస్కారాలను నేర్పిన మా బడి ఇంకా అనేకమందిని ఇదే పద్ధతిలో తీర్చిదిద్దాలని ఆశిస్తూ.... మా గురువులకు భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ....

Read more...

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP